
- మల్లన్న నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
- స్వామివారి దర్శనానికి సుమారు ఎనిమిది గంటల టైం
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకొని కోనేరులో పుణ్య స్నానాలు చేశారు.
అనంతరం గంగరేణి చెట్టు వద్ద, ముఖమంటపం వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత క్యూలో నిలబడి గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మల సమేత మల్లన్నను దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.
అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు, నల్ల పోచమ్మ బోనాలు సమర్పించి, ఒడిబియ్యం పోశారు. రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయానికి సమీపంలోని కోడెల స్తంభం వద్ద రోడ్డుపై డ్రైనేజీ నీళ్లు పారడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు.